BATA: క్యారీ బ్యాగ్ కోసం రూ.3 వసూలు చేసిన బాటా కంపెనీకి రూ.9000 జరిమానా
- ఛత్తీస్ గఢ్ లో ఘటన
- వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి
- బాటా సంస్థకు ఫైన్ వడ్డించిన ఫోరం
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దినేష్ ప్రసాద్ రతూరీ అనే వ్యక్తి బాటా షోరూమ్ కు వెళ్లి రూ.399 విలువైన పాదరక్షలు కొనుగోలు చేశాడు. బిల్ కౌంటర్ వద్ద బాటా సిబ్బంది ఆయనను మరో రూ.3 అదనంగా ఇవ్వమని కోరారు. ఎందుకని అడిగితే, క్యారీ బ్యాగ్ కోసం అని చెప్పారు. అయితే ఆ క్యారీ బ్యాగ్ పై బాటా లోగో ముద్రించి ఉండడం గమనించిన దినేష్ ప్రసాద్, మీ సంస్థ లోగో ఉన్న క్యారీ బ్యాగ్ తో ఉచితంగా పబ్లిసిటీ వస్తుంది, దానికోసం నేనెందుకు అదనంగా రూ.3 చెల్లించాలని వాదించాడు.
అయితే బాటా షోరూం సిబ్బంది ఎంతకీ వినకపోవడంతో బిల్లు మొత్తం రూ.402 చెల్లించి నేరుగా వినియోగదారుల ఫోరం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కన్స్యూమర్ ఫోరం, బాటాకు దిమ్మదిరిగే షాకిచ్చింది. మీ ఉత్పత్తులను కొన్నప్పుడు కస్టమర్లకు ఉచితంగా క్యారీ బ్యాగ్ ఎందుకివ్వరు? అది మీ బాధ్యత కాదా? అంటూ ప్రశ్నించడమే కాకుండా జరిమానా వడ్డించింది.
ఫిర్యాదుదారుడు దినేష్ ప్రసాద్ కు రూ.3 రిఫండ్ చేయడమే కాకుండా, లిటిగేషన్ చార్జీల కింద రూ.1000, పరిహారం రూ.3000, కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ కు రూ.5000... మొత్తం రూ.9000 చెల్లించాలంటూ బాటా సంస్థను ఆదేశించింది.