Dharmapuri Arvind: అనుమానాల నివృత్తికే ఈసీని కలిశా: బీజేపీ నేత అర్వింద్ ధర్మపురి
- ఓటింగ్ శాతం అమాంతం ఎలా పెరిగింది?
- సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరా
- స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతపై ప్రస్తావించా
నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం చాలా పెద్ద విషయమని నిజామాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. నేడు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించిన అనుమానాల నివృత్తికే ఆయనను కలిసినట్టు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు ఆలస్యంగా చేరాయని, ఉపయోగించని వాటికి రెండు రోజుల తర్వాత సీల్ వేస్తున్నారని ఆరోపించారు. ఓటింగ్ శాతం చివరి గంటలో అమాంతం ఎలా పెరిగిందని సీఈవోను అడిగినట్టు తెలిపారు. ఎన్నికల అనంతరం భద్రతకు సంబంధించిన వివరాలన్నింటి గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరినట్టు అర్వింద్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతపై సీఈవో వద్ద ప్రస్తావించానని, దీనికి అక్కడ కేంద్ర బలగాలున్నందున ఎలాంటి ఇబ్బందీ లేదని రజత్ కుమార్ చెప్పారని తెలిపారు.