vijay sai reddy: 15 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న విజయసాయిరెడ్డి క్రిమినల్ కాదా?: బుద్ధా ఫైర్
- 13 కేసుల్లోని ముద్దాయికి అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారు?
- వీవీప్యాట్ స్లిప్పులు కూడా బయట కనిపిస్తున్నాయి
- ఈసీ పై మండిపడ్డ బుద్ధా
ఎన్నికల సంఘం, వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు వేమూరు హరికృష్ణ ప్రసాద్ పై క్రిమినల్ కేసు ఉందని ఈసీ వ్యాఖ్యానించిందని... మరి 13 కేసుల్లో ముద్దాయి అయిన విజయసాయిరెడ్డికి మీరు అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. 15 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న విజయసాయిరెడ్డి క్రిమినల్ కాదా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈసీ కుర్చీలో కూర్చొని మీరు చేసే పని ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రజలంతా మిమ్మల్ని ఇదే ప్రశ్నిస్తున్నారని అన్నారు.
వీవీప్యాట్ స్లిప్పులు కూడా బయట కనిపిస్తున్నాయని... దీనికి మీరేం సమాధానం చెబుతారని బుద్దా ప్రశ్నించారు. వీవీప్యాట్ స్లిప్పులు ఒక్క చోట లెక్కిస్తే చాలన్న ఈసీ వాదనను ఆయన తప్పుబట్టారు. ఐసీయూలో ఉన్న పేషెంట్ మీద ఎన్ని అనుమానాలు ఉంటాయో... అన్ని అనుమానాలు ఈసీ మీద కూడా ఉన్నాయని మండిపడ్డారు. ఎక్స్ రే, స్కానింగ్ తో పాటు ఎన్నో రకాల టెస్టులు చేస్తేనే ఆ రోగి ఉంటాడో, పోతాడో తెలుస్తుందని అన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తికి రాచమర్యాదలు చేశారని... మోదీ డైరెక్షన్ లో ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తాము అడిగిన అధికారులను ఈసీ బదిలీ చేసిందని... అందుకే ఈసీకి ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చామని విజయసాయి చెప్పారని... ఇద్దరికీ ఉన్న సంబంధం ఏమిటో ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోందని మండిపడ్డారు.
ఏపీలో జరిగిన పొరపాట్లు మరో చోట జరగకూడదనే చంద్రబాబు పోరాడుతున్నారని బుద్ధా చెప్పారు. చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు ఈసీ చెప్పిన సమాధానాలు ఆశ్ఛర్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. ఏపీలో చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.