Andhra Pradesh: ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తితే సరిచేసేందుకు సరైన సిబ్బంది ఉండట్లేదు: సీఎం చంద్రబాబు
- ఈవీఎంల హ్యాక్, సాఫ్ట్ వేర్ కోడ్ మార్చే అవకాశం ఉంది
- పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
- వీవీ ప్యాట్స్ లెక్కింపు కుదరదంటే ఎలా?
ఈవీఎంల హ్యాక్, సాఫ్ట్ వేర్ కోడ్ మార్చే అవకాశం ఉందని గుర్తించారని, ఈవీఎంలలో సాంకేతిక లోపం వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది ఉండట్లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఏపీలో ఈవీఎంలు పదేపదే మొరాయించాయని, ఈవీఎంలలో సాంకేతిక లోపం ఉదయం తలెత్తితే మధ్యాహ్నానికి సరిచేశారని, ఓటర్లు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు క్యూలో నిల్చొని ఓటు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. వీవీ ప్యాట్ స్లిప్స్ 7 సెకన్లు కనపడాలి కానీ 3 సెకన్లు మాత్రమే కనిపించిందని విమర్శించారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈసీపై ప్రజల్లో నమ్మకం పోతుందని, ఈవీఎంలు, వీవీప్యాట్స్ కు రూ.9 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఇంత ప్రజాధనం ఖర్చుపెట్టి వీవీ ప్యాట్స్ లెక్కింపు కుదరదంటే ఎలా? వీవీ ప్యాట్స్ లెక్కించడానికి ఆరు రోజుల సమయం పడుతుందా? అని ప్రశ్నించారు.