Andhra Pradesh: చంచల్ గూడ జైలుకా, లేక చర్లపల్లి జైలుకు వెళతారో జగనే తేల్చుకోవాలి!: దేవినేని ఉమ
- కేడర్ ను కాపాడుకోవడానికి జగన్ నానాతంటాలు
- ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీయే
- జగన్ మానసిక స్థితి ప్రమాదకరంగా మారింది
మే 23న కౌంటింగ్ వరకూ కేడర్ ను కాపాడుకోవడానికి జగన్ నానాతంటాలు పడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శ్రీకాకుళం, కడప ఎస్పీలతో పాటు ఇంటెలిజెన్స్ డీజీని ఇష్టానుసారంగా బదిలీ చేస్తుంటే విశ్రాంత అధికారులు ఏమైపోయారని ప్రశ్నించారు. హైదరాబాద్ భూభాగంలో దొంగలు-దొంగలు కలసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమ మాట్లాడారు. ఓటు వేసిన మరుక్షణం పక్క రాష్ట్రానికి పారిపోయిన జగన్, తాము త్వరగా పోవాలని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడికీ వెళ్లబోమనీ, మళ్లీ ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని జోస్యం చెప్పారు.
చంచల్ గూడ జైలుకు వెళతారా? లేక చర్లపల్లి జైలుకు వెళతారా? అని తేల్చుకోవాల్సింది జగనేనని స్పష్టం చేశారు. జగన్ మానసిక స్థితి ప్రమాదకరంగా మారిందని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలను చూసి తట్టుకునేందుకు జగన్ సిద్ధంగా లేరనీ, ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిశోర్ జగన్ చేతిలో సీఎం అనే నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.