KA Paul: కపిల్ సిబల్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్... అందరూ నాతో ఒకే మాటన్నారు: కేఏ పాల్
- మూడో దశ నుంచి ఎన్నికల బహిష్కరణ
- రేపు సుప్రీంకోర్టులో పిటిషన్
- పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందన్న పాల్
దేశంలోని 22 విపక్ష పార్టీలు ఒకే మాటపై ఉన్నాయని, మూడో దశ నుంచి ఏడో దశ వరకూ లోక్ సభ ఎన్నికలను బహిష్కరించనున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీల ఏకాభిప్రాయం మేరకు ఎన్నికలను రద్దు చేయాలని రేపు కోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు. గత రెండు రోజులుగా తనను పలు పార్టీల అధినేతలు కలిశారని, పోలింగ్ ను బహిష్కరించే అంశమై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు.
కపిల్ సిబల్, అఖిలేశ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి వారు తనను కలిశారని చెప్పిన కేఏ పాల్, ఈవీఎంలపై తాము వెలిబుచ్చిన అభ్యంతరాలకు ఈసీ ఇంతవరకూ సమాధానం చెప్పలేదని ఆరోపించారు. తనను కలిసేందుకు ఈసీ అధికారులకు సమయం లేకపోయిందని మండిపడ్డారు.
ఈవీఎంలు సరిగ్గా లేవని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని, ఇప్పుడు హరిప్రసాద్ అదే మాటంటున్నారని అన్నారు. ఏపీలో వినియోగించిన ఈవీఎంలలో 80 శాతం సరిగ్గా పనిచేయలేదని, సాయంత్రం 6 గంటలకు ముగియాల్సిన పోలింగ్, మరుసటి రోజు వరకూ ఎందుకు కొనసాగిందని ప్రశ్నించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాను ప్రయత్నిస్తున్నానని, ఈ విషయంలో ప్రజలంతా తనకు అండగా ఉండాలని కోరారు.