GV Harsha Kumar: నన్ను చంపేందుకు కుట్రపన్నారు: హర్షకుమార్ ఫిర్యాదు
- టీడీపీ ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది
- అమలాపురం టికెట్ ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారు
- సీఈఓను కలిసిన మాజీ ఎంపీ
అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కారు టైర్ల బోల్టులు ఊడదీసి చంపే ప్రయత్నం జరిగిందని అన్నారు. ఈ విషయం అప్పుడే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై లోతుగా విచారణ జరపాలని సీఈవోను కోరినట్టు తెలిపారు.
సామాజిక న్యాయం కోసమే తాను టీడీపీలో చేరానని, కానీ ఆ పార్టీ తనను వేధింపులకు గురిచేసిందని అన్నారు. తాను ఆశించిన అమలాపురం టికెట్ కూడా చివరి నిమిషంలో మరొకరికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే టీడీపీ నుంచి బయటికి వచ్చేశానని హర్షకుమార్ వివరణ ఇచ్చారు.