Baghini: మమత బయోపిక్ ‘బాఘిని: బెంగాల్ టైగ్రెస్’కు బీజేపీ మోకాలడ్డు
- పీఎం నరేంద్రమోదీ సినిమాను సమీక్షించినట్టుగానే దీనినీ సమీక్షించాలని కోరిన బీజేపీ
- ఎన్నికల సంఘం, బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖలు
- మమత బయోపిక్ కాదంటున్న దర్శకనిర్మాతలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘బాఘిని:బెంగాల్ టైగ్రెస్’ సినిమా విడుదలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రధాని నరేంద్రమోదీ జీవితకథ ఆధారంగా రూపొందించిన ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాను సమీక్షించినట్టుగానే మమత బయోపిక్‌ను కూడా సమీక్షించాలని కోరింది.
అయితే, బీజేపీ అభ్యంతరాలను సినిమా దర్శకనిర్మాతలు కొట్టిపడేశారు. నిజానికి ఈ సినిమా మమత బయోపిక్ కాదని, ఆమె జీవితం నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ మాత్రమేనని పేర్కొన్నారు. ‘బాఘిని:బెంగాల్ టైగ్రెస్’ సినిమాలో నాయకురాలు ఇందిరా బందోపాధ్యాయ్ పాత్రలో రుమా చక్రవర్తి నటించారు. అమెను అందరూ ‘దీదీ’ అని పిలుస్తుంటారు. దీనికి తోడు ఈ సినిమా ట్రైలర్‌లో ఇందిర పాత్ర మమతను పోలి ఉండడం కూడా బీజేపీ అభ్యంతరాలకు ఓ కారణం.
అంతేకాదు, అప్పట్లో జరిగిన సింగూరు, నందిగ్రామ్ ఉద్రిక్తతలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు. అప్పటి సీపీఎం ప్రభుత్వం మీద ‘పరివర్తన్’ పేరుతో మమత తలపెట్టిన ర్యాలీ గురించి కూడా చూపించారు. దీంతో ఈ సినిమాను మమత జీవిత చరిత్ర ఆధారంగానే రూపొందించారని బీజేపీ వాదిస్తోంది. అందుకే విడుదలను అడ్డుకోవాలంటూ ఎన్నికల సంఘం, బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖ రాసింది. బీజేపీ అభ్యంతరాలు ఎలా ఉన్నా ‘బాఘిని:బెంగాల్ టైగ్రెస్’ సినిమాకు సెన్సార్ బోర్డు ఇప్పటికే క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం.