Crime News: బీమా సొమ్ము కోసం తోడల్లుడి హత్య.. ఓ ఉపాధ్యాయుడి ఘాతుకం
- భార్యతో కలిసి దారుణం
- మృతుడి తొలి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
డబ్బు కోసం దారుణానికి ఒడిగట్టాడో ఉపాధ్యాయుడు. భార్యతో కలిసి తోడల్లుడినే హత్యచేశాడు. గుట్టుచప్పుడుకాకుండా కుట్ర అమలు చేసినా పాపం పండడంతో కటకటాలపాయ్యాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.
గ్రామానికి చెందిన రాజువాల్ అశ్వాపురం మండలం వెంకటాపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఇతని భార్య రాధ. ఏజెంట్ల తరపున బీమా పాలసీలు చేయిస్తూ కమీషన్ తీసుకునేవాడు. బంధువుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న కొందరి పేరున తానే పాలసీలు ఓపెన్‌చేసి వారి ప్రీమియం చెల్లించేవాడు. వారు చనిపోతే బీమా మొత్తాన్ని ఏజెంట్లతో కుమ్మక్కయి తీసుకునేవాడు. ఇదే క్రమంలో తోడల్లుడు భూక్యారాయుడు (47) పేరున 1.35 కోట్లకు 20 పాలసీలు చేశాడు. ఇతనికి నీలా, బద్రి ఇద్దరు భార్యలు కాగా బద్రి స్వయానా రాజువాల్ భార్య రాధకు చెల్లెలు.
ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబరు 17న భూక్యారాయుడు కరకవాడు శివారులో మేకలు మేపేందుకు వెళ్లి కిన్నెరసాని కాల్వలో పడి మృతి చెందాడు. భార్య బద్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో అతిగా మద్యం సేవించి కాల్వలో పడిపోవడంతో చనిపోయినట్లు నిర్థారణ కావడంతో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా భావించి పోలీసులు కేసు మూసేశారు.
కాగా భూక్యారాయుడు పేరున మొత్తం 20 పాలసీలు ఉండగా అందులో 17 పాలసీలకు నామినీగా రెండో భార్య బద్రి, మూడు పాలసీలకు మొదటి భార్య నీలా పేర్లు ఇచ్చారు. భూక్యారాయుడు బద్రితోనే ఎక్కువగా ఉండడంతో ఈ పాలసీల్లో కొంత మొత్తాన్ని ఆమెకు ఇచ్చి మిగిలిన దాన్ని ఏజెంట్లతో కుమ్మక్కయి రాజువాల్ దంపతులు కొట్టేశారు. అయితే నీలా పేరున మూడు పాలసీలు ఉండడంతో ఏజెంట్లు ఆమెను సంప్రదించారు.
పాలసీలు కట్టే అంత స్తోమత తన భర్తకు లేదని, మరి ఈ పాలసీలు ఎవరు కట్టారన్న అనుమానం వచ్చిన ఆమె విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించింది. దీంతో పోలీసులు క్లోజ్ చేసిన ఫైల్‌ను ఓపెన్ చేసి మళ్లీ దర్యాప్తు చేయగా ఆశ్చర్యపోయే వివరాలు బయటపడ్డాయి.
తోడల్లుడి పేరున 1.35 కోట్ల రూపాయలకు జీవిత బీమా పాలసీలు తీసుకుని, ప్రీమియంలు రాజువాల్, రాధ దంపతులు చెల్లించారని, తర్వాత ఆ బీమా సొమ్ము కొట్టేయాలన్న పథకంతో అతనితో పూటుగా మద్యం తాగించి కాలువలోకి తోసేసి హత్య చేశారని బయటపడింది. దీంతో రాజువాల్ దంపతులతోపాటు హత్యకు వీరికి సహకరించిన వడ్డే వెంకటకృష్ణ (ఆటో డ్రైవర్), సమీప బంధువు బోడా కృష్ణతోపాటు ఓ మైనర్‌ను అరెస్టు చేశారు.