Andhra Pradesh: మొత్తం ఓటర్లు 299.. పోలైన ఓట్లు 350.. ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో విచిత్రాలు!
- రెండు కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ పోలింగ్
- అద్దంకి నియోజకవర్గంలో ఘటన
- వివరణ ఇచ్చిన ఎన్నికల అధికారి
ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో విచిత్రం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం 48వ పోలింగ్ కేంద్రంలో, అద్దంకి పట్టణంలోని 154వ పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్ల కంటే పడిన ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
సంతమాగులూరు మండలంలోని 48వ పోలింగ్ కేంద్రంలో 299 మంది మహిళా ఓటర్లు ఉండగా 350 ఓట్లు పడినట్లు ఎన్నికల అధికారులు నమోదు చేశారు. అలాగే అద్దంకి పట్టణంలోని 154 పోలింగ్ కేంద్రంలో 435 మంది పురుష ఓటర్లు ఉండగా, 500 ఓట్లు పోలైనట్లు చూపారు.
నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదయిందని ఎంట్రీలు రాశారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో ఎన్నికల అధికారి సాయిబాబు స్పందిస్తూ.. ఎన్నికల రోజున హడావుడిలో కంప్యూటర్లో ఈ వివరాలను తప్పుగా నమోదు చేశారని అంగీకరించారు. కేవలం కంప్యూటర్ ఎంట్రీలో మాత్రమే పొరపాటు జరిగిందనీ, వీటిని సరిచేసి తిరిగిపంపిస్తామని స్పష్టం చేశారు.