MPTC ZPTC: తెలంగాణ ‘స్థానిక’ పోరుకు రంగం సిద్ధం...నేడో, రేపో పరిషత్ నోటిఫికేషన్
- రిజర్వేషన్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- ఏర్పాట్లు పూర్తిచేసిన ఎన్నికల సంఘం
- పరిశీలకుల నియామకం కూడా పూర్తి
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసేలోగా పరిషత్ ఎన్నికలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అంశాన్ని చకచకా పూర్తి చేయడంతో, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. దీంతో నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల చేయడం మాత్రమే ఉంది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి కలెక్టర్లు, పోలీసులు, పంచాయతీ అధికారులతో సమావేశమై ఎన్నికల సంసిద్ధతపై సమీక్షించారు. జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాక అధికారుల సన్నద్ధత మేరకు నోటిఫికేషన్ విడుదల తేదీ నిర్ణయించనున్నారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం యోచిస్తోంది.
కాగా, పరిషత్ ఎన్నికల కోసం జిల్లా సాధారణ పరిశీలకులను నియమిస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఆదేశాలిచ్చింది. ఆ వివరాలు... ఆదిలాబాద్, నిర్మల్: స్వాతి లక్రా; కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల: మహ్మద్ అబ్దుల్ నదీమ్; జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట: శరవణన్ ; కరీంనగర్, పెద్దపల్లి: పౌసుమి బసు ; భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం: శశిధర్ రెడ్డి ;
గద్వాల్, వనపర్తి: కె.వై. నాయక్ ; మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్: శర్మన్ ; మెదక్, సంగారెడ్డి: వాకాటి కరుణ ; నల్గొండ, సూర్యాపేట: చంపాలాల్ ; యాదాద్రి భువనగిరి, మేడ్చల్: సోనిబాలాదేవి ; కామారెడ్డి, నిజామాబాద్: అభిలాశ్ బిస్త్ ; రంగారెడ్డి, వికారాబాద్: శ్రీలక్ష్మి ; భూపాలపల్లి, ములుగు, జనగాం: ఆకునూరి మురళి ; మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్: బి. శ్రీనివాస్‌లను నియమించింది.