Andhra Pradesh: చంద్రబాబు చేసిన ద్రోహాన్ని గుర్తుంచుకుని మరీ ప్రజలు ఓటేశారు!: వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి
- సైకిల్ కు ఓటేస్తే ఫ్యానుకు పడుతుందని బాబు అంటున్నారు
- మరి టీడీపీకి 130 సీట్లు వస్తాయని ఎలా చెబుతున్నారు?
- విజయనగరంలో మీడియాతో వైసీపీ ఎమ్మెల్సీ
ఈవీఎంల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యానుకు పడుతుందని సీఎం చంద్రబాబు చెప్పడంపై వైసీపీ నేత, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. అలాంటప్పుడు ఈసారి టీడీపీకి 130 అసెంబ్లీ సీట్లు వస్తాయని చంద్రబాబు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు రాకముందే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. తొలుత ఈసీని బెదిరించిన చంద్రబాబు, అది ఫలితం ఇవ్వకపోవడంతోఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
విజయనగరంలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, వాటిని హుందాగా స్వీకరించాల్సింది పోయి ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు తప్పుపట్టం సరికాదని హితవు పలికారు. జైలుకు పోవాల్సి వస్తుందన్న భయంతోనే చంద్రబాబు వేర్వేరు పార్టీల నేతలతో కలుస్తున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన నమ్మక ద్రోహాన్ని ఏపీ ప్రజలు గుర్తుంచుకుని మరీ ఓటేశారని వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమన్నారు. విజయనగరంలో నీటికొరత తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.