chennai: చెన్నైలో పట్టుబడ్డ టీటీడీ బంగారం వ్యవహారంలో ఏదో మతలబు ఉంది: వాసిరెడ్డి పద్మ అనుమానం
- పలు అనుమానాలు కలుగుతున్నాయి
- టీటీడీ అధికారులు నోరుమెదపడం లేదు
- దీనిపై విచారణ నిర్వహించి, వాస్తవాలు బయటపెట్టాలి
నిన్న చెన్నైలోని వెప్పంపట్టు సమీపంలో ఓ వాహనంలో తరలిస్తున్న 1381 కిలోల బంగారాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది పట్టుకున్న విషయం తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉంచిన ఈ బంగారం కాలపరిమితి ముగియడంతో తిరుమలకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ, ఈ వ్యవహారంపై టీటీడీ అధికారులు నోరుమెదపడం లేదని విమర్శించారు. దీనిపై విచారణ నిర్వహించి, వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ బంగారం టీటీడీది అని పోలీస్ అధికారులు ధ్రువీకరిస్తున్నప్పటికీ, దేవస్థానం ఈవో, చైర్మన్ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. సెక్యూరిటీ, ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఈ వాహనంలో టీటీడీ బంగారాన్ని తరలించడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. ఇందులో ఏం మతలబు ఉంది? అనధికారికంగా తరలిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై టీటీడీ అధికారులు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమని, పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.