Delhi: నాపై దాడికి యత్నించడం విచిత్రంగా ఉంది: బీజేపీ ఎంపీ జీవీఎల్
- నాపై చెప్పు విసిరిన వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి
- ఈ వ్యక్తి కోట్ల విలువ చేసే కొన్ని బంగ్లాలు కొన్నాడు
- ఐటీ శాఖాధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు
ఢిల్లీలో మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతుండగా కాన్పూర్ కు చెందిన శక్తి భార్గవ అనే వైద్యుడు చెప్పు విసరడం తెలిసిందే. ఈ సంఘటనపై జీవీఎల్ స్పందిస్తూ, ఓ వ్యక్తి చేసిన ఆ హడావిడి తనను ఉద్దేశించి చేసింది కాదని, అతనెవరో తనకు, తానెవరో అతనికీ ఎంత మాత్రం తెలుసన్నది తనకు తెలియదని అన్నారు.
అయితే, తనపై చెప్పు విసిరిన వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్టు తనకు మీడియా ద్వారా తెలిసిందని అన్నారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ వ్యక్తిపై, ఆయన నడిపే కొన్ని సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ వారు దాడులు చేశారని అన్నారు. దాదాపు రూ.500 కోట్ల విలువ చేసే కొన్ని బంగ్లాలను ఈ వ్యక్తి కొన్నట్టుగా తెలుసుకున్న ఐటీ శాఖాధికారులు దీనిపై ఆరా తీసిన విషయాన్ని ప్రస్తావించారు.
ఆయన చేసిన తప్పుడు పనులకు ఐటీ శాఖ తన పని తాను చేసుకుపోతుంటే, ఈ రకంగా తనపై దాడికి యత్నించడం విచిత్రంగా ఉందని అన్నారు. ఈ దాడి యత్నం వెనుక ఏమైనా దురుద్దేశాలు, రాజకీయ కారణాలు ఉన్నాయా? అన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుందని అన్నారు.