Asaduddin Owaisi: మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆమెను బరిలో దించేవాళ్లే కాదు: మోదీపై మండిపడిన ఒవైసీ
- మోదీ అబద్ధాల కోరులకు రారాజు
- ఉగ్రవాదంపై పోరులో చిత్తశుద్ధి లేదు
- ఔరంగాబాద్ సభలో ఒవైసీ వ్యాఖ్యలు
ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ నిర్వహించిన ఓ భారీ బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ప్రధానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎన్నికల బరిలో దించేవాళ్లే కాదని అన్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి ఎన్నికల బరిలో పోటీచేస్తున్నారు.
ఇవాళ ప్రకటించిన జాబితాలో బీజేపీ అధినాయకత్వం ఆమెకు స్థానం కల్పించడాన్ని ఒవైసీ తప్పుబట్టారు. దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ అబద్ధాల కోరులకు రారాజులా వెలుగొందుతున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. "మీరా ఉగ్రవాదంపై పోరాడేది? ఉగ్రవాదంపై పోరాడడం మీకు ఏమాత్రం ఇష్టంలేదు. మీరే గనుక చిత్తశుద్ధి ఉన్నవాళ్లయితే ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి టికెట్ ఇచ్చేవాళ్లు కాదు" అంటూ ఒవైసీ నిలదీశారు.