sadhvi pragya singh thakur: జైల్లో తనను దారుణంగా కొట్టారంటూ కన్నీరు పెట్టుకున్న బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్
- మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞపై ఆరోపణలు
- 13 రోజులపాటు పోలీసు కస్టడీ
- ఆ సమయంలో తనను చిత్రహింసలకు గురిచేశారన్న సాధ్వి
జైల్లో ఉన్నప్పుడు పోలీసులు తనను దారుణంగా కొట్టారని చెబుతూ భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం ఆమె భోపాల్‌లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విషయాన్ని చెబుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వీని అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 13 రోజులపాటు కస్టడీలో ఉన్నారు.
తాను జైలులో ఉన్నన్ని రోజులు సిబ్బంది తనకు నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద కొరడాతో తనను చావబాదారని, విచక్షణ రహితంగా చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. తనపై కనీస జాలి కూడా చూపకుండా హింసించారని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా జైల్లో ఉన్న 13 రోజులు కొడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. మాలేగావ్ పేలుళ్లు తన పనేనని తన నోటితో చెప్పించాలనే ఉద్దేశంతోనే పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారని ప్రజ్ఞ ఆరోపించారు. కాగా, 2008లో మాలేగావ్‌లోని ఓ మసీదు వద్ద జరిగిన పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, వందమందికిపైగా గాయపడ్డారు.