Tamil Nadu: ఓటరు జాబితాలో పేరు లేదని తెలిసి ఆ వృద్ధురాలి గుండె ఆగింది!
- గుండె పోటుతో పోలింగ్ కేంద్రంలోనే చనిపోయిన వృద్ధురాలు
- పేరు లేదని చెప్పగానే కుప్పకూలి మృతి
- చెన్నై పుదుపేటలో ఘటన
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఓ వృద్ధురాలి గుండె అక్కడే ఆగిపోయింది. ఎంతో ఉత్సాహంగా ఓటు వేసేందుకు వెళ్లిన ఆమె.. ఓటరు జాబితాలో తన పేరు లేదని తెలియగానే హతాశురాలయింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పోలింగ్ సిబ్బంది, తోటి ఓటర్లు స్పందించి పైకిలేపేలోగానే ఆమె ప్రాణం పోయింది.
వివరాల్లోకి వెళితే... తూత్తుకుడికి చెందిన సెచ్చిలి మోరాల్ (74) యాభై ఆరేళ్ల క్రితం చెన్నై వచ్చి పుదుపేట తిరువెంకట వీధిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ గురువారం తమిళనాడులో జరగడంతో తమ పరిధిలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లింది. ఆమె చేతిలో కార్డు ఉన్నా ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో అక్కడి అధికారులు అదే విషయాన్ని చెప్పారు. దిగ్భ్రాంతికి గురైన ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందింది. ఎంతలేపినా లేవకపోవడంతో ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. ఎగ్మూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.