Crime News: పాస్ కానేమో అని ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధినికి పాస్ మార్కులు

  • కన్నీటి పర్యంతమవుతున్న తల్లిదండ్రులు
  • లెక్కల పరీక్ష రాశాక తప్పుతానన్న బెంగతో బలవన్మరణం
  • ఫలితాలు వెలువడ్డాక వెల్లడైన వాస్తవం

క్షణికావేశం ఆమె నూరేళ్ల జీవితాన్ని చిదిమేసింది. పాస్‌కానేమో, తల్లిదండ్రులకు ముఖం ఎలా చూపించగలనన్న బెంగతో ఆమె ఈ లోకాన్నే విడిచి వెళితే, ఫలితాలు ప్రకటించాక కూతురి విజయం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేటకు చెందిన విష్ణుమాచారి, సుగుణ దంపతులు 25 ఏళ్ల క్రితం మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు.

తమ కుమార్తె నవ్యశ్రీ (18) బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆమెకు మంచి చదువు చెప్పిస్తున్నారు. ఆమె కూడా బాగానే చదివేది. ఇంటర్ మొదటి సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించింది. రెండో సంవత్సరం పరీక్షల్లో ఆంగ్లం, సంస్కృతం పరీక్షలు బాగా రాసింది. మూడోదైన మ్యాథ్స్‌ పేపర్‌-1ను మార్చి 6వ తేదీన రాశాక నిరాశ చెందింది.

బాగా రాయలేదని, పాస్‌కానేమో అని తోటి విద్యార్థుల వద్ద వాపోయింది. ఆ ఆవేదనతో ఇంటికి వచ్చిన నవ్యశ్రీ తల్లిదండ్రుల ఆకాంక్ష తీర్చలేనేమోనన్న బెంగతో కుంగిపోయింది. ఇక మిగతా పరీక్షలు రాయకుండానే, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనుకోని ఈ విషాదంతో నవ్యశ్రీ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. బిడ్డ బంగారు భవిష్యత్తును గొప్పగా ఊహించుకున్నామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని వాపోయారు.

గురువారం ఇంటర్‌ ఫలితాలు వెలువడగా ఆంగ్లంలో 64, సంస్కృతంలో 82, మ్యాథ్స్‌-1లో 27 మార్కులు సాధించినట్టు వెల్లడి కావడంతో నవ్యశ్రీ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ఈ సందర్భంగా విష్ణుమాచారి మాట్లాడుతూ ఆ రోజు తాము ఇంట్లో ఉండి ఉంటే తమ బిడ్డను రక్షించుకునేవాళ్లమని, తమకీ క్షోభ ఉండేది కాదని భోరుమన్నారు.

  • Loading...

More Telugu News