Andhra Pradesh: పోటీ చేసిందే 65 సీట్లలో.. మరి 88 స్థానాలు ఎలా వస్తాయ్ జేడీ?: విజయసాయిరెడ్డి
- జనసేన 88 సీట్లు గెలుస్తుందన్న జేడీ లక్ష్మీనారాయణ
- ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించిన వైసీపీ నేత
- చంద్రబాబు పాకిస్థాన్ లోనూ ప్రచారం చేస్తాడని ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 88 సీట్లలో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ చెప్పడంపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. జనసేన పార్టీ కేవలం 65 స్థానాల్లోనే పోటీ చేసిందనీ, అలాంటప్పుడు 88 చోట్ల ఎలా విజయం సాధిస్తుందని ప్రశ్నించారు.
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కల్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నారు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అని ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబును పాకిస్థాన్ వాళ్లు పిలిచినా వెళ్లి ప్రచారం చేసి వస్తాడని ఎద్దేవా చేశారు. 50 శాతం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించాలని చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళితే, అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింటిని లెక్కిస్తే చాలని కోర్టు తీర్పు చెప్పిందన్నారు. అయినా చంద్రబాబు వీవీప్యాట్లు అన్నింటినీ లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు చంద్రబాబు ఒక్కరి కోసమే జరగడం లేదన్నారు.