Chandrababu: చంద్రబాబు గారూ, చూస్తుండండి!... జనం మిమ్మల్ని పరిగెత్తించి కొడతారు: బొత్స
- చంద్రబాబును అందరూ తిరస్కరించారు
- తానేదో అతీతుడ్నని భావిస్తారు
- ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడాల్సిందే
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కోడ్ అమల్లో ఉంటే సమీక్షా సమావేశాలు ఎలా నిర్వహిస్తారంటూ మండిపడ్డారు. తాను అన్నింటికి అతీతుడ్నని భావించడం సరికాదని, రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని చంద్రబాబుకు హితవు పలికారు.
చంద్రబాబు ఈ రాష్ట్రంలో పూర్తిగా విశ్వాసం కోల్పోయారని, రాష్ట్రంలోని పార్టీలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఆయన పక్షాన ఉన్నది రాష్ట్రంతో సంబంధంలేని కొన్ని జాతీయ పార్టీలు, తన జాతి నేతలు మాత్రమేనని బొత్స ఎద్దేవా చేశారు. ఈ రెండు అంశాలు తప్ప చంద్రబాబును తక్కిన ప్రపంచం అంతా తిరస్కరించిందని వ్యాఖ్యానించారు.
"చంద్రబాబు తన పార్టీ నేతలతో తరచుగా టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ వాళ్లకు కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. తామే గెలుస్తున్నామని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేది తానేనని చెబుతున్నారు. అంతేకాకుండా, మీకు పరిచయం ఉన్న వైసీపీ శాసనసభ్యులు, వైసీపీ అభ్యర్థులతో పరిచయాలు పెంచుకోండి అని చెబుతున్నారట. మళ్లీ ఇదో లాజిక్కు! మరో మోసానికి తెరలేపారు! చంద్రబాబునాయుడు గారూ, ప్రజలు అమాయకులు కాదు, మిమ్మల్ని రాళ్లతో కొడతారు, పరిగెత్తించి మరీ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమికొడతారు. మీకెలాగూ అమరావతిలో సొంత ఇల్లు లేదు. హైదరాబాద్ లో సొంత ఇల్లుంది కాబట్టి అక్కడికే వెళ్లిపోండి. లేకపోతే జాతీయపార్టీల్లో ఎవర్నో ఒకర్ని అడిగి వాళ్ల రాష్ట్రం వెళ్లిపోండి" అంటూ నిప్పులు చెరిగారు.