Chandrababu: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబు 18 రహస్య జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి?: బొత్స
- రాష్ట్రంపై మరో రాష్ట్రం దండెత్తుతోందా?
- ఎవరన్నా దురాక్రమణ చేస్తున్నారా?
- ఇందులో 'కాన్ఫిడెన్షియల్' ఏంటి?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు ఆగమేఘాల మీద 18 రహస్య (కాన్ఫిడెన్షియల్) జీవోలు జారీచేసినట్టు తెలిసిందని అన్నారు. ఇందులో అంత రహస్యంగా జారీచేయాల్సిన అవసరం ఏంటని బొత్స ప్రశ్నించారు.
"ఎవరన్నా దురాక్రమణ చేస్తున్నారా? లేకపోతే, రాష్ట్రంపై మరో రాష్ట్రం దండెత్తుతోందా? అంత అర్జంటుగా కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కాన్ఫిడెన్షియల్ ఎందుకు? మరికొన్ని రోజుల్లో అన్ని బండారాలు బట్టబయలవుతాయి. చంద్రబాబుకు కూడా అన్ని వాస్తవాలు తెలుసు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్పాయో తెలుసు, సర్వేలు ఏం చెబుతున్నాయో కూడా తెలుసు. అందుకే అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిరోజులు ఓపికపడితే ఈ ప్రభుత్వం చరిత్ర అంతా బయటికి వస్తుంది" అంటూ హెచ్చరించారు.