Botsa Satyanarayana: చంద్రబాబునాయుడు ఏమన్నా పవిత్రుడా? కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోలేదా?: బొత్స
- రానున్నది జగన్ ప్రభుత్వమే
- మాది ప్రజా ప్రభుత్వం
- ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తాం
ఏపీలో తెలుగుదేశం పార్టీ శకం ముగిసిందని అన్నారు వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో రాబోయేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు మాయల్ని మరిపించేలా జగన్ జనరంజకంగా పరిపాలిస్తారని స్పష్టం చేశారు.
"వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో, జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం వస్తోంది. చంద్రబాబునాయుడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రతి విషయంలోనూ మోసం, దగా చేశారు. ఆయనకు గానీ, టీడీపీకీ గానీ ఏ వ్యవస్థపైనా నమ్మకంలేదు. వాళ్లను వాళ్లు నమ్ముతారు తప్ప ఎవర్నీ నమ్మరు. ఏపీ పోలీసుల్ని నమ్మరు అని మమ్మల్ని అంటారు. కానీ మాకు ఏపీ పోలీసులపై ఎంతో గౌరవం ఉంది. మన పోలీసు వ్యవస్థ ఎంతో పటిష్ఠమైనది. కానీ చంద్రబాబు పోలీసు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాడు. చంద్రబాబుకు డీజీపీ కూడా జతకలిశాడు. మేం చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నాం.
ఇంతకుముందు ఉన్న సీఎస్ ఎన్నికల సంఘం ఆదేశాలను సక్రమంగా అమలుచేయలేని పరిస్థితుల్లో ఉండడం గమనించి కొత్త సీఎస్ ను తెచ్చారు. ఇదంతా ఎన్నికల సంఘమే చూసుకుంది తప్ప, అందులో ఏంజరిగిందనేది ఎవరికీ తెలియదు. దానికి టీడీపీ ఆ స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబునాయుడు ఏమన్నా పవిత్రుడా? కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోలేదా? ఈయన రాష్ట్రాన్ని దోచుకుతినలేదా? చివరికి ఈయన కూడా మాట్లాడతాడు!" అంటూ నిప్పులు చెరిగారు.
కొందరు పోలీసు అధికారులు కూడా తొత్తులుగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఏడాదిగా తన ఫోన్ ను ట్యాప్ చేసి ఉంచారని బొత్స వెల్లడించారు. చంద్రబాబునాయుడు పాలనలో ఇలాంటివే జరుగుతాయని అన్నారు.