Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ... దర్శనానికి 26 గంటల సమయం!
- భక్తులతో నిండిన 31 కంపార్టుమెంట్లు
- సర్వ దర్శనానికి 26 గంటల సమయం
- మిగతా భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయం
వేసవి సెలవులు రావడం, పలు పరీక్షల ఫలితాలు వెల్లడి కావడంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి భక్తుల తాకిడి పెరగడంతో, అందుకు అనుగుణంగా తిరుపతి నుంచి తిరుమల మధ్య అదనపు బస్సులను నడపాల్సి వచ్చింది. కొండపై ప్రస్తుతం లక్షన్నర మందికి పైగా భక్తులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
శ్రీవారి దర్శనార్థం వేచివున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారని టీటీడీ ప్రకటించింది. స్వామి వారి సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్ తీసుకున్నవారికి, నడక దారి భక్తులకు, రూ. 300 ప్రత్యేక దర్శనానికి మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతోందని పేర్కొన్నారు. క్యూలైన్లలోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా అన్న పానీయాలను సమకూరుస్తున్నామన్నారు.