Jagan: జగన్ సీఎం అయి, రోజా గెలిస్తే మంత్రి పదవి ఖాయమట!
- ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా రోజా
- రెండోసారి నగరి నుంచి బరిలోకి
- గెలుపోటములపై జోరుగా పందాలు
ఆర్కే రోజా... సినీ నటిగా తన అందచందాలతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుని, ఆపై రాజకీయాల్లో రాణించి, తొలుత తెలుగుదేశంలో, ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ దఫా ఎమ్మెల్యేగా పని చేసిన ఆమె, మరోసారి పోటీలో నిలిచారు. ఆమెకు పోటీగా దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు గాలి భాను బరిలో ఉండటంతో ఇక్కడ పోటీ ఆసక్తిగా మారింది. గెలుపుపై ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నగరి గెలుపోటములపై పందాలు సైతం జోరుగా సాగుతున్నాయి.
ఇక వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితంగా ఉండే పార్టీ నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న రోజా, ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతుందని ఆమె అభిమానులు అంటున్నారు. వైసీపీకి మెజారిటీ వచ్చి జగన్ సీఎం అయితే, రోజాకు మంత్రి పదవి ఖాయమని కూడా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశంపై ఏవైనా ఆరోపణలు చేయాల్సి వస్తే, రోజా ముందు నిలుస్తారన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మీడియా సైతం రోజా వ్యాఖ్యలను మిగతా నేతలతో పోలిస్తే ప్రముఖంగా ప్రచురిస్తుంది. వార్తా చానెళ్లు సైతం రోజాను చూపేందుకు ఉత్సాహపడుతుంటాయి. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడాలంటే వైసీపీ రోజా వైపే చూస్తుంది.
వాస్తవానికి నగరిలో ఈ దఫా మహిళా ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన మహిళా ఓట్లు తనకేనని రోజా అంటుంటే, చంద్రబాబు సంక్షేమ పథకాల కారణంగానే ఆ ఓట్లు టీడీపీకి పడ్డాయని భాను అంటున్నారు. విశ్లేషణల సంగతి ఎలావున్నా, జగన్ సీఎం అయితే, రోజా ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేస్తారన్న ప్రచారమూ సాగుతోంది.