Road Accident: విశాఖ హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీకాంతం ప్రమాదంలో మరణించారా? హత్యా?
- వెలుగు చూస్తున్న సరికొత్త అనుమానాలు
- కావాలని ఢీకొట్టారా అన్న సందేహాలు
- గాజువాకకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 11వ తేదీన జరిగిన తొలి విడత పోలింగ్ ఎన్నికల బందోబస్తు విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీకాంతం మృతిపై సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. విశాఖ కమిషనరేట్ పరిధి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల్లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఆ రోజు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న లక్ష్మీకాంతంను విశాఖ నగరంలోని మర్రిపాలెం జంక్షన్లో ఇన్నోవా కారు ఢీకొట్టడంతో తుళ్లి రోడ్డుపై పడ్డారు.తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు ప్రమాదంగానే కేసు నమోదు చేశారు.
అయితే ఈ ప్రమాదానికి కారణం తానేనని, ఆ సమయంలో కారు నడుపుతున్నది తానేనని గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన ఓ వ్యక్తి కేసు దర్యాప్తు చేస్తున్న ఎయిర్ పోర్టుజోన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే, ఇతన్ని విచారించిన సమయంలో ఘటన జరిగినప్పుడు యశ్వంత్ అనే వ్యక్తి కారు నడుపుతున్నాడని తేలడంతో అతన్ని పట్టుకున్నారు. అతను పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసుల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. దీంతో కేసును లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.