West Bengal: ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రి... ఒక్క రూపాయి జీతం తీసుకోరు.. మమతా బెనర్జీ నిరాడంబరత్వం ఇది

  • తన రచనలపై వచ్చిన ఆదాయం నుంచే వ్యయం
  • ప్రభుత్వ నిధులు ఒక్క రూపాయి ఖర్చు చేయని వైనం
  • ఈతరం ప్రజా ప్రతినిధులకు ఆమె జీవితం ఆదర్శం

ప్రజాధనమంటే సొంత ఖజానాలా, అధికారం అంటే దర్పం ప్రదర్శించేందుకు వచ్చిన అవకాశంగా భావించే ఈతరం రాజకీయ నాయకుల్లో చాలామందికి ఆమె నిరాడంబర జీవితం ఆదర్శం. ఎనిమిదేళ్లుగా ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె ఇప్పటి వరకు సర్కారు ఖజానా నుంచి తన సొంత అవసరాలకు ఒక్కరూపాయి వాడుకోలేదంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఈ ఘనత పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకే దక్కుతుంది. బెంగాలీ బెబ్బులిగా, దీదీగా చిరపరిచితురాలైన మమతా బెనర్జీది మొదటి నుంచి సాధారణ జీవితం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తన తీరు మార్చుకోలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన వివరాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

ఆమెకు పెన్షన్‌గా నెలకు లక్ష, సీఎంగా జీతం మరో లక్ష రూపాయలు వస్తాయి. కానీ జీతం నుంచి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు విత్‌డ్రా చేయలేదు. కారు కొనుక్కోలేదు. బిజినెస్‌ క్లాస్‌ విమానంలో ప్రయాణించ లేదు. అతిథి గృహంలో ఉంటే సొంత డబ్బులే ఖర్చు చేసుకుంటారు. ఆఖరికి టీ తాగినా ఆమె తన సొంత డబ్బులే వెచ్చిస్తారు. మరి ఆమెకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు.

‘నేను ఇప్పటి వరకు 86 పుస్తకాలు పబ్లిష్‌ చేశాను. వీటిలో బెస్ట్‌సెల్లర్స్‌గా నిలిచిన వాటి నుంచి 11 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ డబ్బంతా నేనేం చేసుకుంటాను’ అంటారు ఆమె. ఆమె తన పుస్తకాలు, సాహిత్యంపై వచ్చిన ఆదాయం, పెయింటింగ్స్‌ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత విరాళంగా ఇచ్చేస్తారు. మిగతాది తన సొంత ఖర్చుకు వినియోగించుకుంటారు.

 ప్రజా ప్రతినిధి అంటే హంగు, ఆర్భాటం, దర్జా, దర్పం అనుకునే ఈ తరం నేతల్లో కొందరికైనా దీదీ జీవితం ఆదర్శమైతే ప్రజాధనం కొంతైనా అభివృద్ధికి మిగులుతుంది.

  • Loading...

More Telugu News