Andhra Pradesh: ఇప్పుడున్న ఈసీ 'మోడ్' ఆఫ్ కాండక్టా? లేక 'మోదీ' ఆఫ్ కాండక్టా?: యనమల
- విధుల నిర్వహణలో ఈసీ విఫలమైంది
- కోడ్ అమల్లో ఉన్నప్పుడు ‘మోడ్ ఆఫ్ కాండక్ట్’ ఎవరికైనా ఒక్కటే
- ప్రధానైనా, సామాన్యుడైనా చట్టం ముందు సమానమే
ఎన్నికల సంఘం, ప్రధాని మోదీపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడున్న ఈసీ మోడ్ ఆఫ్ కాండక్టా? లేక మోదీ ఆఫ్ కాండక్టా? అని ప్రశ్నించారు. ఆర్టికల్ 324 ఈసీకి స్వయం ప్రతిపత్తిని ఇచ్చిందని, రాజ్యాంగ పరంగా సర్వాధికారాలు ఈసీకి ఉన్నాయి కానీ, విధుల నిర్వహణలో ఈసీ విఫలమైందని విమర్శించారు.
ప్రధాని అయినా, సామాన్యుడైనా చట్టం ముందు సమానమేనని, కోడ్ అమల్లో ఉన్నప్పుడు మోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరికైనా ఒక్కటేనని అన్నారు. మోదీ ప్రయాణించిన హెలికాఫ్టర్ లో సోదాలు చేసిన అధికారిని సస్పెండ్ చేస్తారా? నమో ఛానెల్ ను మోదీ ఏ విధంగా ప్రారంభిస్తారు? ఈ ఛానెల్ వ్యయం మోదీ ఎన్నికల ఖర్చులో ఎందుకు కలపడం లేదు? వ్యక్తిగత భజన చేసే ఛానెళ్లను ఈసీ ఎందుకు బ్యాన్ చేయదు? అని ఆయన ప్రశ్నించారు.