Telangana: ఇంటర్ మీడియట్ ఫలితాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదు: తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి
- ఇంటర్ ఫలితాలపై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు
- విద్యార్థులందరి వివరాలు మా వద్ద భద్రంగా ఉన్నాయి
- విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు
తెలంగాణలో ఇంటర్ మీడియట్ ఫలితాలపై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, ఎలాంటి అపోహలకు ఆస్కారం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయన్న ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో అశోక్ స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, పరీక్షకు హాజరుకాని విద్యార్థి కూడా ఉత్తీర్ణుడైనట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. 21 వేల మంది విద్యార్థుల వివరాలు గల్లంతైనట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఒక్క విద్యార్థి సమాచారం కూడా గల్లంతు కాలేదని స్పష్టం చేశారు. విద్యార్థులందరి వివరాలు బోర్డు వద్ద భద్రంగా ఉన్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అన్ని అర్హతలు కలిగిన వారితోనే మూల్యాంకనం చేయించినట్టు వివరించారు.