Rajamouli: ఇంట్లో రాజమౌళి నాకు గౌరవం ఇవ్వాల్సిందే: విజయేంద్ర ప్రసాద్
- మోడ్రన్ తండ్రీకొడుకులం కాదు
- నేనో పాతకాలపు తండ్రిని
- రాజమౌళి ఈస్థాయికి ఎదుగుతాడని ఎప్పుడూ అనుకోలేదు
ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ తన కుమారుడు, ప్రముఖ దర్శకుడు రాజమౌళితో తన అనుబంధం గురించి చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తామిద్దరం ఏమాత్రం మోడ్రన్ తండ్రీకొడుకులం కాదని స్పష్టం చేశారు. తాను ఓ పాతకాలపు తండ్రినని అన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు రాజమౌళి తనకు గౌరవం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుంటానని తెలిపారు. అయితే అది ఇంటివరకే పరిమితం అని, సెట్స్ మీద మాత్రం రాజమౌళే బాస్ అని వెల్లడించారు.
ఒక్కోసారి ఇద్దరిమధ్య వాదోపవాదాలు జరిగినా దర్శకుడే కెప్టెన్ కాబట్టి అతడి మాటకే విలువిస్తానని విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు. చాలాసార్లు ఇలా జరిగిందని, ఇలాంటి భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. వాస్తవానికి రాజమౌళి ఇంత పెద్ద దర్శకుడు అవుతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని, తనకు రచనల్లో సహకారం అందిస్తూ దర్శకుడు అయ్యాడని వెల్లడించారు. రాజమౌళిలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే ఓ కథను అత్యంత ఆకట్టుకునే విధంగా చెప్పగలడని కొడుకుపై ప్రశంసల వర్షం కురిపించారు.