Narendra Modi: తల్లి ఆశీస్సులు తీసుకుని అహ్మదాబాద్‌లో ఓటేసిన ప్రధాని మోదీ
- ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్
- కుమారుడు మోదీకి హీరాబెన్ ఆశీస్సులు
- ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మోదీ పిలుపు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఉదయం మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్ రనిప్‌లోని నిశన్ హయ్యర్ సెకండరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఆయన గాంధీనగర్ చేరుకుని ఆయన తల్లి హీరాబెన్ నివాసానికి వెళ్లారు. కుమారుడికి హీరాబెన్ శాలువా లాంటి వస్త్రాన్ని బహూకరించి తలపై చేతులు పెట్టి ఆశీర్వదించారు.
అనంతరం మోదీ అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ చేరుకుని రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. సొంత రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.