Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
- రాహుల్ వివరణ పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి
- తమ తీర్పుపై తప్పుగా వ్యాఖ్యానించారన్న ధర్మాసనం
- తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ దొంగ అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా నిన్న సుప్రీంకోర్టుకు రాహుల్ లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాఫెల్ డీల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను చదవలేదని... ఎన్నికల వేడిలోనే తాను ఆ వ్యాఖ్యలను చేశానని తన వివరణలో రాహుల్ తెలిపారు.
కోర్టు ధిక్కార పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేడు విచారించింది. 'సుప్రీంకోర్టు తీర్పు గురించి ప్రతివాది (రాహుల్ గాంధీ) తప్పుగా వ్యాఖ్యానించారు. చౌకీదార్ చోర్ అని అర్థం వచ్చేలా కోర్టు మాట్లాడలేదు. రాఫెల్ డీల్ కు సంబంధించిన డాక్యుమెంట్ల గురించే కోర్టు మాట్లాడింది' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. కోర్టు ధక్కార పిటిషన్ కు రివ్యూ పిటిషన్ ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.