Kerala: కేరళలోని కన్నూరులో విచిత్రం.. వీవీప్యాట్ యంత్రంలో తాపీగా చేరిన పాము!
- ఓటేసేందుకు వచ్చి అదిరిపడ్డ ప్రజలు
- పాములు పట్టే వ్యక్తి సాయంతో తొలగింపు
- విచారణ ప్రారంభించిన అధికారులు
సార్వత్రిక ఎన్నికల వేళ కేరళలోని కన్నూరు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రంలోకి పాము దూరింది. ఈ నియోజకవర్గంలోని మయ్యిల్ కందక్కయ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని ఓ వీవీప్యాట్ లోకి అది వెళ్లి కూర్చుంది. ఓటు వేసేందుకు తాపీగా లోపలకు వచ్చిన ఓ వ్యక్తి పామును చూసి ఒక్కసారిగా బెదిరిపోయాడు. అతని అరుపులతో ప్రజలు కూడా భయాందోళనకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు పాములు పట్టే ఓ వ్యక్తి సాయంతో ఈ పామును వీవీప్యాట్ నుంచి తొలగించారు. అనంతరం సమీపంలోని పంటపొలాల్లో వదిలిపెట్టారు.
ఈ సందర్భంగా కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వీవీప్యాట్ లోకి పాము దానంతట అదే వచ్చిందా? లేక ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు ఎవరైనా వదిలివెళ్లారా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 117 స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.