Andhra Pradesh: తెలుగు రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే ‘జనసేన’ లక్ష్యం: మాదాసు గంగాధరం
- పోలవరం’కు కేసీఆర్ సహకరిస్తారని ఆకాంక్ష
- కొత్త ముంపు ప్రాంతాలు చేరితే వాటికీ న్యాయం చేయాలి
- నెల్లిపాక వరకు కరకట్ట నిర్మించాలి
తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యం అన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన చెప్పిన విధంగానే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సహకరిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం ఆకాంక్షించారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం పెంపుతో భద్రాద్రికి ముప్పు అని టీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు దిన ప్రతికల్లో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.
ఈ సందర్భంగా గంగాధరం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ వలన ఏర్పడే ముంపు ప్రాంతాలకు ఇప్పటికే పరిహారం అందిస్తున్నందున కొత్తగా ఏమైనా ముంపు ప్రాంతాలు చేరితే వాటికీ న్యాయం చేయాలని జనసేన పార్టీ కోరుతున్నట్టు చెప్పారు.
ముంపు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల నుంచి తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన నెల్లిపాక వరకు కరకట్టను నిర్మించాలని డిమాండ్ చేశారు. కరకట్ట నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లు అభివృద్ధి చేయటం ద్వారా వెనుక జలాల వల్ల ఏర్పడే ముంపు ప్రాంతాల తీవ్రతను తగ్గించవచ్చని, ఆ విధంగా కృషి చేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ముంపు ప్రాంతాల నష్ట పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇరు రాష్ట్రాలు సంయమనంతో ముందుకు సాగాలని, రెండు తెలుగు రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం జనసేన పార్టీ కృషి చేస్తున్నట్టు చెప్పారు. తెలుగు రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే జనసేన పార్టీ లక్ష్యం అని, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇరు రాష్ట్రాలు సంయమనంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.