TTD: టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై సీఎస్ కు నివేదిక అందజేత
- ఈ వ్యవహారంపై ముగిసిన విచారణ
- సీఎస్ ను కలిసిన ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్
- టీటీడీ ఈవో, విజిలెన్స్, పీఎన్బీ అధికారుల విచారణ
టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై తలెత్తిన ఆరోపణలపై విచారణ పూర్తయింది. ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ దీనిపై విచారణ చేశారు. టీటీడీ ఈవో, విజిలెన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) అధికారులను విచారించారు. ఈ వ్యవహారంపై ఓ నివేదికను తయారు చేశారు. సెక్రటేరియట్ లో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను మన్మోహన్ సింగ్ కలిసి ఈ నివేదికను ఆయనకు అందజేశారు.
కాగా, ఈ నెల 17న చెన్నైలోని వెప్పంపట్టు సమీపంలో ఓ వాహనంలో తరలిస్తున్న 1381 కిలోల టీటీడీ బంగారాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది పట్టుకుంది. ఈ వ్యవహారంపై పలు విమర్శలు రావడంతో, విచారణ జరపాలని మన్మోహన్ సింగ్ ను విచారణాధికారిగా రెండు రోజుల క్రితం నియమించారు. ఈ నెల 23 లోగా నివేదిక ఇవ్వాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించడం తెలిసిందే.