Sri Lanka: దాడులకు సరిగ్గా రెండు గంటల ముందు శ్రీలంకను హెచ్చరించిన భారత్
- శనివారం రాత్రి తొలిసారిగా హెచ్చరికలు
- ఆదివారం ఉదయం మరోసారి సమాచారం
- అయినా పట్టించుకోని శ్రీలంక
శ్రీలంకలో జరిగిన ఘోరకలి అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులపై, హోటళ్లలో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదులు పంజా విసరడం తెలిసిందే. సుమారు ఎనిమిది చోట్ల పేలుళ్లు జరగ్గా 320 మందికి పైగా మరణించారు. 450 మంది వరకు క్షతగాత్రులయ్యారు. అయితే, ఈ దాడులకు ముందే శ్రీలంకను భారత్ హెచ్చరించింది.
కొలంబోలోని ఓ చర్చిలో తొలి దాడి జరగడానికి సరిగ్గా రెండుగంటల ముందు భారత నిఘా సంస్థ శ్రీలంక అధికారులతో తన వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకుంది. చర్చిలు, ఇతర ప్రార్థన స్థలాలపై దాడులు జరిగే అవకాశం ఉందని భారత్ హెచ్చరించినట్టు శ్రీలంక రక్షణ శాఖ వర్గాలు అంగీకరించాయి.
అంతేకాదు, అంతకుముందు రోజు రాత్రి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ భారత్ నుంచి సందేశాలు వచ్చినట్టు శ్రీలంక వర్గాలు తెలిపాయి. అయితే, భారత్ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో శ్రీలంక భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.