Sri Lanka: శ్రీలంక పేలుళ్ల మృతుల్లో బంగ్లాదేశ్ ప్రధాని బంధువుల అబ్బాయి!
- తండ్రితో కలిసి హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా ఘటన
- పేలుళ్లలో మొత్తం 38 మంది విదేశీయుల దుర్మరణం
- బ్రిటన్కు చెందిన యువ తోబుట్టువులు కూడా మృతి
శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడుల్లో మృతి చెందిన వారిలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బంధువులకు చెందిన 8 ఏళ్ల కుర్రాడు ఉన్నట్టు తెలిసింది. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన శ్రీలంక పేలుళ్లలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్ లేబర్ పార్టీ ఎంపీ అయిన తులిప్ సిద్ధిఖీకి కూడా బంధువైన ఎనిమిదేళ్ల జయన్ చౌధురి కొలంబోలోని హోటల్లో తండ్రితో కలిసి అల్పాహారం తీసుకుంటుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కజిన్ మనవడే జయాన్.
శ్రీలంక పేలుళ్లలో మొత్తం 38 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోగా అందులో జయాన్ ఒకడు. అలాగే, బ్రిటన్ టీనేజ్ తోబుట్టువులైన అమెలీ (15), డేనియల్ లిన్సీ (19) కూడా దుర్మరణం పాలయ్యారు. హాలీడేను ఎంజాయ్ చేయడానికి వచ్చిన వీరు టూర్ చివరి రోజున ప్రాణాలు కోల్పోయారు. కాగా, పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 321 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.