Apple: యాపిల్ పై రూ. 7 వేల కోట్లకు దావా వేసిన 18 ఏళ్ల యువకుడు!
- కష్టాలు తెచ్చిపెట్టిన ఫేస్ డిటెక్షన్
- సాఫ్ట్ వేర్ లోపాలతో పలుమార్లు అరెస్ట్
- మన్ హటన్ కోర్టులో దావా
యాపిల్ ఫోన్లలోని సాఫ్ట్ వేర్ లోపాల కారణంగా తనను దొంగగా చిత్రీకరించారని, దీంతో తన పరువు పోయిందని ఆరోపిస్తూ, 18 ఏళ్ల యువకుడు ఏకంగా బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7 వేల కోట్లు) చెల్లించాలంటూ కోర్టులో దావా వేశాడు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, 18 ఏళ్ల ఔస్మేన్ బా, తన ఫోన్ లో ఫేస్ డిటెక్షన్ సెట్టింగ్స్ చేసుకున్నాడు. ఇక బా డేటాను దొంగిలించిన ఓ దొంగ, తన ఫోటోకు బా పేరుతో పాటు మొత్తం వివరాలన్నీ జోడించి, యాపిల్ స్టోర్లకు వెళ్లి దొంగతనం చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ ఫోటో వ్యక్తి వివరాలను పట్టుకుని పోలీసులు వరుసగా ఔస్మేన్ బాను అరెస్ట్ చేయడం, ప్రశ్నించి వదిలిపెట్టడం... ఇలా పలుమార్లు జరిగింది.
అయితే, చేయని తప్పుకు తననెందుకు మానసిక వేదనకు గురి చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసిన బా, యాపిల్ సాఫ్ట్ వేర్ లోపమే ఇందుకు కారణమని పసిగట్టాడు. ఆపై యాపిల్ సమాధానం చెప్పాల్సిందేనని, తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, మన్ హటన్ లోని కోర్టులో దావా వేశాడు. కాగా, బా ఆరోపణలపై యాపిల్ ఇంకా స్పందించలేదు.