Tunga: తుంగ నదిలో చనిపోతున్న చేపలు... నీటిని తాగేందుకు భయపడుతున్న ప్రజలు!
- ఒడ్డుకు కొట్టుకొస్తున్న చేపలు
- ఆకుపచ్చ రంగులోకి మారిన నీరు
- ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్న అధికారులు
కొన్ని వందల గ్రామాల ప్రజల మంచినీటి అవసరాలను తీర్చే తుంగ నదిలో చేపలు చనిపోయి, ఒడ్డుకు కొట్టుకు వస్తుండటంతో ఆ నీటిని తాగేందుకు ప్రజలు భయపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ ప్రాంతంలో తుంగ నది నీటిని అన్ని రకాల అవసరాలకూ వాడుతుంటారు. గత కొన్ని రోజులుగా ఈ నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతోందన్నది సమీప ప్రాంతాల ప్రజల ఆరోపణ. ఇదే సమయంలో నదిలోని చేపలు మరణించి, తీరానికి కొట్టుకు వస్తున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న ప్రజలు, నీరు కలుషితమైందని, దాన్ని తాగితే, తమకూ జబ్బులు రావచ్చని అంటున్నారు. కాగా, విషయం తెలుసుకున్న అధికారులు, నదిలోని నీటిని, చేపలను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. రిపోర్టు రాగానే అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు.