Telangana: కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి షాక్.. బెయిల్ కు నాంపల్లి కోర్టు నో!
- ముందస్తు బెయిల్ కోసం ఈ నెల 22న పిటిషన్
- కొండా విన్నపాన్ని తిరస్కరించిన నాంపల్లి కోర్టు
- ఎస్ఐ, కానిస్టేబుళ్లను నిర్బంధించినట్లు కేసు నమోదు
తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు తిరస్కరించింది. ఇటీవల ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలి ప్రాంతంలో తనిఖీల్లో దొరికిన రూ.10 లక్షల విషయమై నోటీసులు ఇచ్చేందుకు ఎస్ఐ కృష్ణ తన సిబ్బందితో విశ్వేశ్వరరెడ్డి కార్యాలయానికి వెళ్లారు. కానీ అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి తన అనుచరులతో పోలీసులను నిర్బంధించారు.
అంతేకాకుండా ఎస్ఐని పరుష పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయిన కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం పోలీసులు గత వారం రోజులుగా బంజారాహిల్స్ తో పాటు ఇతర ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మూడ్రోజుల క్రితం నాంపల్లి కోర్టులో కొండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు దాన్ని తిరస్కరించింది.