Pragya Singh: సింధీ మహిళలు నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్
- వీల్ చెయిర్ లో వచ్చి నామినేషన్
- ఇప్పుడు ఉత్సాహంగా నర్తించడంపై కాంగ్రెస్ నేతల మండిపాటు
- కోర్టును తప్పుదోవ పట్టించారంటూ విమర్శలు
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాధ్వీ ప్రజ్ఞా సింగ్. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె ఈ లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీలో ఆమెకు విశేషంగా పలుకుబడి ఉండడంతో పేలుళ్ల కేసులో ఆమెపై పెద్దగా ఒత్తిడి పడడంలేదంటూ విమర్శలు ఉన్నాయి.
సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఇటీవలే వీల్ చెయిర్ లో వచ్చి నామినేషన్ వేశారు. దాంతో ఆమె ఆరోగ్యం బాగాలేదని అనుకున్నారు. అయితే, సాధ్వీ నామినేషన్ అయిపోయిన తర్వాత సింధీ మహిళలు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం పలు విమర్శలకు దారితీసింది.
ఏప్రిల్ 23న వీల్ చెయిర్ లో వచ్చి నామినేషన్ వేసి ఆ తర్వాత భైరాంగఢ్ లో జరిగిన కార్యక్రమంలో ఇతర మహిళలతో కలిసి రెచ్చిపోయి నర్తించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అనారోగ్యం అంటూ కోర్టును తప్పుదోవ పట్టించారని విమర్శ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా దర్శనమిస్తోంది.
కాగా, మాలేగావ్ పేలుళ్ల మృతుడి కుటుంబ సభ్యుడు ఒకరు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అది తిరస్కరణకు గురైంది. ఎన్నికల్లో పోటీచేయకుండా ఆమెను నిరోధించాలని ఆ పిటిషన్ లో కోరినా కోర్టు కొట్టిపారేసింది. మాలేగావ్ కేసులో సాధ్వీ బెయిల్ పొందడానికి అనారోగ్యం సాకుగా చూపారని ఆ వ్యక్తి ఆరోపించారు.