Telangana: ఎదగాల్సిన బిడ్డలను మొగ్గలో తుంచేశారు: కొండా సురేఖ
- ఈ ఘటనపై కేటీఆర్ మౌనం తగదు
- గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోవాలి
- విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలి
ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా దారుణమైన విషయమని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. హన్మకొండలో ఈరోజు విలేకరులతో ఆమె మాట్లాడుతూ, భావి భారత పౌరులుగా ఎదగాల్సిన బిడ్డలను మొగ్గలో తుంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఇరవై మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే వరకూ ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి స్పందించకపోవడం దారుణమని అన్నారు.
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కేటీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. మూడున్నర లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేస్తామని చెప్పడం కూడా కరెక్టు కాదని, అన్ని పేపర్లనూ తిరిగి మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా, గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంస్థపై గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయని, ఇలాంటి సంస్థకు ఇంటర్ బోర్డు ఫలితాలను అప్పజెప్పడం వల్ల ఈ దారుణం జరిగిందని మండిపడ్డారు. ఈ సంస్థపై, అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు.