Chandrababu: ఆ విషయం చెబుతుంటే జాతీయ నాయకులు ఆశ్చర్యపోయారు: చంద్రబాబు
- ఎన్నికల బాధ్యతలు లేని వారు ప్రభుత్వంతోనే పనిచేయాల్సి ఉంటుంది
- రాజకీయ నాయకులు ఇచ్చే రూ.2 వేల కోసం ఆశపడడం బాధగా ఉంది
- ఈ విషయంలో మోదీనే మొదటి ముద్దాయి
ఇటీవల ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు తెల్లవారుజామున 4:30 గంటల వరకు క్యూలలో నిల్చుని ఓట్లు వేశారని చెబుతుంటే జాతీయ నాయకులు ఆశ్చర్య పోయారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో గురువారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు ఈ విషయం చెప్పారు. మన పోరాటం ఎన్నికల సంఘంపైనే తప్ప ఇక్కడి అధికారులపై కాదని స్పష్టం చేశారు. ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న వారు తప్ప మిగతా వారు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ ఐదేళ్లలో అధికారులు బాగానే సహకరించారని సీఎం ప్రశంసించారు. అయితే, ఇప్పుడు వారిని కులం, మతం పేరుతో విభజించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఐదేళ్లలో ప్రజలకు ఎంతో చేశానని చెప్పిన చంద్రబాబు.. ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు ఇచ్చే రెండు వేల రూపాయలకు ఆశపడడం చూస్తుంటే బాధగా ఉందన్నారు. రూ.2వేలు, రూ.500 నోట్లు లేకపోతే ఈ సమస్య వచ్చి ఉండేదే కాదని అభిప్రాయపడ్డారు. దీనికి మొదటి ముద్దాయి మోదీయేనని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ను మోదీ దుర్వినియోగం చేశారని అన్నారు. తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలపై కూడా చంద్రబాబు స్పందించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు.