RBI: రిజర్వ్ బ్యాంక్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు!
- ఆర్టీఐ చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే
- వార్షిక నివేదికలను బహిర్గతం చేయండి
- రుణాల ఎగవేతదారుల పేర్లు చెప్పాల్సిందే
- ఆర్బీఐ తీరు కోర్టుకు వ్యతిరేకంగా ఉందన్న న్యాయమూర్తి
సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్బీఐ జరిపే వార్షిక తనిఖీల నివేదికను, బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను ఎగ్గొట్టిన వారి పేర్లను ఆర్టీఐ కింద బహిర్గతం చేయాల్సిందేనని శుక్రవారం ఆదేశించింది. ఆర్బీఐకి వ్యతిరేకంగా హక్కుల కార్యకర్త ఎస్సీ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం, ఇప్పటికే ఈ విషయంలో ఓ మారు ఆర్బీఐని హెచ్చరించామని, అయినా పట్టించుకోలేదని, ఇదే చివరి అవకాశమని, వెంటనే కోరిన వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.
గత జనవరిలో వార్షిక తనిఖీల నివేదికను బయట పెట్టేందుకు ఆర్బీఐ నిరాకరించగా, కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. అయినా ఆర్బీఐ స్పందించకపోవడంతో తీవ్రంగా మండిపడిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందేనని ఆర్బీఐని హెచ్చరించింది. ఆర్బీఐ వ్యవహరిస్తున్న తీరు 2015లో తామిచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉందని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నివేదికలను బహిర్గతం చేసే విషయంలో తాము ఆఖరి చాన్స్ ఇస్తున్నామని అన్నారు.