Sri Lanka: టెర్రరిస్టులను గుర్తించేందుకు అవసరమైతే పాక్ సాయం తీసుకుంటాం: శ్రీలంక ప్రధాని
- ఉపఖండంలో అన్ని దేశాలు ఉగ్ర సమస్య ఎదుర్కొంటున్నాయి
- అంతర్జాతీయ ఉగ్రవాదంపై భారత్ ఎంతో పోరాడుతోంది
- గొప్ప భద్రత వ్యవస్థలు ఉన్న దేశాలకు కూడా ఈ సమస్య తప్పడంలేదు
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే కొలంబో పేలుళ్లపై ఓ భారత మీడియా సంస్థకు ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కొలంబోలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ లో శిక్షణ పొందినట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. పాకిస్థాన్ తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, ఉగ్రవాదంపై పోరులో ఆ దేశం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోందని తెలిపారు.
కొలంబో పేలుళ్ల నిందితులను గుర్తించే క్రమంలో అవసరమనుకుంటే పాకిస్థాన్ సాయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషాద ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య నమ్మకం మరింత బలపడుతుందని, సహకారం మరింత విస్తరిస్తుందని భావిస్తున్నట్టు విక్రమసింఘే తెలిపారు.
ఇక, భారత్ గురించి చెబుతూ, కొలంబో దాడి సూత్రధారులపై కఠినచర్యలకు సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తమకు మాటిచ్చారని లంక ప్రధాని వెల్లడించారు. ఎల్టీటీఈని ఓడించడం వెనుక భారత్ ఆశీస్సులు, అందించిన సహాయం కీలక అంశాలు అని అన్నారు. భారత్ అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఉపఖండంలో ప్రవేశించకుండా ఎంతో పోరాటం చేస్తోందని, అయితే, గొప్ప భద్రత వ్యవస్థలున్న దేశాలు కూడా ఉగ్రవాదానికి బలవుతున్నాయని విక్రమసింఘే పేర్కొన్నారు.