Rahul Gandhi: అన్నదాతలకు రాహుల్ గాంధీ కీలక హామీలు
- వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
- రుణాలు చెల్లించలేని రైతులకు దన్నుగా ప్రత్యేక చట్టం
- ఇక రైతులు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటూ భరోసా
ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఒడిశాలోని బాలాసోర్ లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సాధారణ బడ్జెట్ కంటే ముందే రైతు బడ్జెట్ ను ప్రవేశపెడతామని చెప్పారు.
అంతేగాకుండా, పంట రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేని రైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని, తద్వారా రుణాలు చెల్లించలేని రైతులు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మాత్రం వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ, అణగారిన రైతులను ఎందుకు శిక్షిస్తోందంటూ ప్రశ్నించారు.