Nalgonda District: ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావుకు బెయిలు
- అమృత బాబాయ్ శ్రవణ్‌కుమార్, మరో నిందితుడు కరీంకు కూడా
- గత ఏడాది సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య
- అప్పటి నుంచి వరంగల్ జైలులో ఉంటున్న నిందితులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితులకు ఏడు నెలల అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ప్రణయ్ హత్య జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న భార్యకు వైద్య పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తీసుకు వెళ్లిన ప్రణయ్ భార్య, మరో కుటుంబ సభ్యురాలితో కలిసి బయటకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన వ్యక్తి కత్తితో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే.
కుమార్తె ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో అమృత తండ్రి తిరునగరి మారుతీరావే కోటి రూపాయలకు పైగా సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, మరో నిందితుడు కరీంపై గత ఏడాది సెప్టెంబరు 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదుచేసి వీరిని అరెస్టు చేశారు.
అప్పటి నుంచి వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంటున్న ముగ్గురు నిందితులు రెండు నెలల క్రితం బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందంటూ అప్పట్లో పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో కోర్టు వీరి బెయిలు పిటిషన్ తిరస్కరించింది.
తమకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల మరోసారి వీరు హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన హైకోర్టు ముగ్గురికీ బెయిలు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందగానే వీరు విడుదల కానున్నారు.
కాగా, ప్రణయ్ హత్య సమయానికి ఐదు నెలల గర్భిణిగా ఉన్న అమృత ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమృత ప్రణయ్ కుటుంబ సభ్యులతోనే కలిసి ఉంటోంది.