USA: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖంపై ఫోన్ విసిరిన మద్దతుదారుడు!
- ఇండియానా రాష్ట్రంలోని ఎన్ఆర్ఏ సమావేశంలో ఘటన
- సమావేశంలో పూటుగా మద్యం తాగిన విలియం
- అదుపులోకి తీసుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చేదు అనుభవం ఎదురయింది. ఇండియానా రాష్ట్రంలోని ఇండియానపొలిస్ ప్రాంతంలో జరిగిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఆయన ప్రసంగించేందుకు వేదికపైకి వస్తుండగా, ఓ వ్యక్తి తన ఫోన్ ను ట్రంప్ పైకి విసిరేశాడు. అయితే ఆ ఫోన్ ట్రంప్ కు తగలకుండా పక్కనే వేదికపై పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతాసిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు.
కాగా, ఇదంతా పట్టించుకోని ట్రంప్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగం పూర్తయ్యేంతవరకూ ఆ ఫోన్ వేదికపైనే ఉండిపోయింది. కాగా, ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. ఫోన్ విసిరిన వ్యక్తి పేరు విలియమ్ రోస్ అనీ, అతను ట్రంప్ మద్దతుదారుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూటుగా మద్యం సేవించిన విలియం.. మత్తులో ట్రంప్ పైకి ఫోన్ ను విసిరేసినట్లు భావిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై తాము దర్యాప్తు చేస్తున్నామనీ, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.