Rahul Gandhi: 'చౌకీదార్' ఎఫెక్ట్! రాహుల్ గాంధీపై బీహార్ లో కేసు నమోదు
- కాపలాదారుడే దొంగ అంటూ వ్యాఖ్య
- ప్రజలతో కూడా ఆ నినాదాన్ని పలికించిన రాహుల్
- కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది సత్యవ్రత్
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీహార్ లో కేసు నమోదైంది. సమస్తిపూర్ లో జరిగిన ఎన్నికల సభలో ఆయన 'చౌకీదార్ చోర్ హై' (కాపలాదారుడే దొంగ) అంటూ మోదీపై విమర్శలు చేయడమే కాకుండా, అదే నినాదాన్ని ప్రజలతో కూడా పలుమార్లు చెప్పించారు. దాంతో, రాహుల్ గాంధీపై న్యాయవాది సత్యవ్రత్ నేరుగా న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.
రాహుల్ తో పాటు అదే సభలో పాల్గొన్న ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ పైనా సత్యవ్రత్ ఫిర్యాదు చేశారు. రెండు మీడియా చానళ్లు కూడా ఈ విషయంలో అత్యుత్సాహం చూపించాయంటూ సత్యవ్రత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాహుల్ తాను అనడమే కాకుండా ప్రజలతోనూ పలికించడం తనను మనస్తాపానికి గురిచేసిందని ఆ న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. దేశద్రోహం, ప్రజల్లో భయాందోళనలు కలిగించడం వంటి సెక్షన్లను ఉపయోగించి రాహుల్ పై కేసు నమోదుచేయాలని కోరినట్టు ఆయన వెల్లడించారు.