Maharashtra: హేమంత్ కర్కరేపై సాధ్వి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే: మహారాష్ట్ర సీఎం
- తన శాపం వల్లే కర్కరే మృతి చెందారన్న సాధ్వి ప్రజ్ఞ
- తీవ్రంగా తప్పుబట్టిన సీఎం ఫడ్నవిస్
- హేమంత్ దేశం కోసం ప్రాణాలు విడిచారని కొనియాడిన ముఖ్యమంత్రి
ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరే తన శాపం వల్లే మృతి చెందారంటూ బీజేపీ భోపాల్ లోక్సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తప్పుబట్టారు. కర్కరేపై ఆమె వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని తేల్చి చెప్పారు. ముంబై పేలుళ్లకు రెండు నెలల ముందు జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి పాత్రపై హేమంత్ కర్కరే దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన ముంబై ఉగ్రదాడిలో కర్కరే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కర్కరే తన శాపం వల్లే మృతి చెందారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సాధ్వి వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన సీఎం ఫడ్నవిస్.. హేమంత్ చాలా ధైర్యవంతుడైన అధికారి అని కొనియాడారు. దేశం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారన్నారు. హేమంత్పై సాధ్వి వ్యాఖ్యలు సరికావన్నారు. సాధ్వికి వ్యక్తిగతంగా ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఉండొచ్చని, కానీ వాటిని ఆమె సరైన సమయంలో, సరైన ప్రదేశంలో వ్యక్తీకరిస్తే బాగుండేదని ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. అయితే, కర్కరేపై చేసిన వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకోవడం హర్షించదగ్గ విషయమేనని, కర్కరేపై అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఫడ్నవిస్ పేర్కొన్నారు.