USA: అమెరికాలో యూదు ప్రార్థనాలయంలో ఉన్మాది కాల్పులు.. ఒకరి దుర్మరణం, ముగ్గురికి గాయాలు!
- కాలిఫోర్నియాలోని పోవేలో ఘటన
- కాల్పుల అనంతరం పరారైన యువకుడు
- ఇది విద్వేష నేరమేనన్న అధ్యక్షుడు ట్రంప్
అగ్రరాజ్యం అమెరికా మరోసారి నెత్తురోడింది. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగో నగరంలోని ఓ యూదు ప్రార్థనాలయంలోకి చొరబడ్డ దుండగుడు.. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.
శాన్ డియాగో నగరంలోని పోవేలో ఉన్న యూదు ప్రార్థనాలయంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు జరిపిన జాన్ ఎర్నెస్ట్(19) యువకుడిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇతను దాడి కోసం ఏఆర్ కేటగిరీకి చెందిన సెమీ ఆటోమేటిక్ రైఫిల్ వాడాడని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వైట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షుడు ట్రంప్ దీన్ని విద్వేష దాడిగా అభివర్ణించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు వెంటనే పట్టుకున్నారనీ, ఇందుకు ధన్యవాదాలు తెలిపారు.